Monday 16 January 2012

View My Stats

పర్యావరణానికి మనకీ మధ్య ప్రత్యక్ష అనుబంధం వుంది. ప్రకృతి తోడు లేక మనిషి మనుగడ సాగించలేడు.      పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరిది. గాలిని నీటిని మట్టినీ కలుషితం చేస్తూ తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నాడు. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి ప్రకృతి గురించి ఆలోచిస్తే దాని పట్ల  మనమెంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నామో అవగతమవుతుంది. మన అవసరాల కోసం రాళ్ళని పిండి చేస్తాం.. చెట్లని నరికేస్తాం.. జంతువులని మన ఆకలికి బలిచేస్తాం. రేపు ఏం జరుగుతుందో మనకి అనవసరం నేటి మన సుఖం మనకి  కావాలి అంతే! స్వార్థం! కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మనమింతటి దారుణానికి ఒడిగడుతున్నాం.                      
రోజుకి కొంతసమయం జీవప్రపంచంతో.. పచ్చని మొక్కలతో గడుపుదాం. వాటి చిన్న చిన్న అవసరాలని తీరుద్దాం. మనం బ్రతుకుదాం వాటిని బ్రతికిద్దాం. ఈ భూమ్మీద మనకెంత హక్కుందో వాటికీ అంతే వుంది. నోరులేని జీవాలని తుదముట్టించకూడదు. ఇప్పటికే కొన్ని జీవరాశులు అంతరించి పోయాయి. మరికొన్ని చివరి            ఊపిరి తీసుకుంటున్నాయి.                                                                                          మనిషికి విచక్షణ వుంటుందంటారు..కాని ప్రకృతి విషయంలో విచక్షణ ఎందుకు కోల్పోతున్నాడో తెలియడం లేదు. ఈ   భూమ్మీద కొంతకాలం గడపడానికి వచ్చాం..ఒక ఆదర్శనీయమైన అథితిలా మనదైన ముద్రవేసి వెళ్ళాలి. రాబోయే       కొత్త అథితులకోసం స్వచ్ఛమైన ప్రకృతిని కానుకగా ఇవ్వాలి. విషతుల్యమైన పర్యావరణానికి బలయ్యేది మనవాళ్ళే! అది మర్చిపోకూడదు. ఇప్పటికే పేరు తెలియని కొత్త కొత్త రోగాలు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ముందు ముందు ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయో తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడవక మానదు. మనం ఇప్పుడే జాగృతులమవుదాం! మనవంతు కృషి చేద్దాం! రోజూ ప్రకృతి కోసం కొంత సమయం కేటాయిద్దాం..బస్సుల్లో రైల్లలో మన తోటి ప్రయాణీకులతో ఈ విషయంలో చర్చిస్తూ అవగాహన కలిగిద్దాం.                                                                      
ఈ బ్లాగుని సందర్శించే వాళ్ళు ఈ యజ్ఞంలో భాగస్వాములు. ప్రకృతి పట్ల మీకు తోచిన ఏ చిన్న ప్రయత్నం చేసినా చాలు. పర్యావరణం పట్ల మన ఉడతా భక్తిని చాటుకుందాం. ఆకుపచ్చ నమస్కారాలతో..                                          
పర్యావరణం^రక్షతి^రక్షితః.                                                                                                                                        
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు